Monday, March 10, 2008

"చందమామ" అనుభూతులు మరపురానివి


మా ప్రియ మిత్రుడు రాంకీ వలన మన చిననాటి నేస్తం చందమామను గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.
ఈ సందర్భంగా చందమామతో నాకున్న అనుబంధాన్ని నెమరువేస్తున్నాను.
నా చిన్న తనంలో నాకు పుస్తక పఠనంపై అంతగా ఆశక్తి ఉండేది కాదు. కొబ్బరి మట్టలతో, తాటిటెంకలతో మొదలెట్టిన బంతాట(క్రికెట్) రెండు రూపాయల రబ్బరు బంతి కొని చెక్క బ్యాటుతో ఆడేవరకూ వచ్చింది. బంతి ఉంటే ఏడుపెంకులాట, బ్యాటు కూడా ఉంటే క్రికెట్, రెండూ లేకపోతే చెడుగుడు. ఇలా గడచిపోతున్న కాలంలో ఒకమారు మా సుశీలాబాయి టీచర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండడం చూసాను. వాళ్ళబాయి మధు నా ఈడు వాడు కావడంతో ఇద్దరం కూర్చోని బొమ్మరిల్లు, చందమామ చదివాం. నా చేతిలో చందమామ బొమ్మరిల్లుతో పొలిస్తే కొంచం చిన్నదిగా అనిపించింది, అందుకని వెంటనే పుస్తకాలు మార్చుకుని చూసాను, రెండిటిలో చందమామే బావుందనిపించింది, ఎందుకో తెలియదు. అలా మొదలైన చందమామ పరిచయం కొన్నాళ్ళకి ఆగిపోయింది.

ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా ఒక మిత్రుడు బాలమిత్రలోని ఒక మిని నవల కథ చెప్పాడు. అది ఒక రక్త పిచాచి కధ. అది నిజమో కాదోనని తను ఎక్కడ చవివాడో కనుక్కొని అక్కడకు వెళ్ళాను. అది శాఖా గ్రంధాలయం. బజారు దగ్గరే ఒక హోటల్ పక్కగా ఎవరికి బయటకు కనపడనట్లుగా ఉండేది. ఆ రోజు మొదలు నాలుగు సంవత్సరాలు, ఎనిమిదో తరగతి వరకూ ఒక్క చందమామను కూడా వదల లేదు. ఎప్పుడు కూరగాయల కోసం బజారుకెళ్ళినా అక్కడ కనీసం పావుగంటైనా ఉండాల్సిందే. భేతాళ కథలు, రామాయణం వంటి సీరియల్స్ తో మొదలుకొని , ఒక అయిదారు మూడు పేజీల కథలు, రెండు మూడు పిట్ట కథలు, పాతికేళ్ళనాటి చందమామ కథ, ఒక విదేశీ కథానువాద, వింత వార్తలు, ఇలా సాగేది ప్రస్థానం.

బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటివెన్ని ఉన్నా చందమామ స్దానం చందమామదే!!!

3 comments:

kanthisena said...

మిత్రమా.. చందమామతో మీ అనుభూతుల గురించి ఇప్పుడే చదివాను. చందమామతో నా మూడు పదులు అనుబంధాన్ని ఇతరులతో పంచుకోవాలని సాగించిన అన్వేషణ చివరకు ఆ పత్రిక ఆన్‌లైన్‌లోనే ఉద్యోగం పొందగల అపూర్వమైన అవకాశాన్ని నాకు ఈ మధ్యే ఇచ్చింది. మీరన్నది నిజం. పిల్లలతో గడిపేందుకు, వారి బాల్య కౌతుకాలను పరామర్శించేందుకు తగిన సమయం తల్లిదండ్రులకు లేని తరుణంలో చందమామ కొన్ని తరాల పిల్లలను ప్రేమగా పలకరించింది. పిండి వెన్నెల చల్లదనంతో పిల్లల బాల్యాన్ని తడిపింది. మీరూ, నేనూ, ఇలా ఎందరూ కొన్ని తరాల పిల్లలు చంద్ర జ్ఞాపకాలతో బాల్యాన్ని గడిపేశారు..మన తర్వాతి తరం పిల్లలకు చందమామ జ్ఞాపకాలు మిగలాలంటే మీరు ఇంకా ఇలాంటి అనుబవాలను వీలు చూసుకుని అక్షరాల్లో పెడితే చాలా బాగుంటుంది కదూ. ఆలోచించండి. అతి త్వరలో చందమామ ఆన్‌లైన్ ఎడిషన్ పాత, కొత్తల మేలు కలయికతో పిల్లల, పెద్దల ఆదరాన్ని, అబిమానాన్ని చూరగొనాలనే చిరుకోరికతో ముందుకు వస్తోంది. చందమామ మిత్రుడిగా మీరు ఆన్‌లైన్ చందమామను కూడా క్రమం తప్పకుండా ఫాలో కావాలని, నాణ్యత కోసం చేసే ప్రయత్నంలో దానికి సూచనలు, మంచిమాటలు పంపాలని ఆశిస్తూ, ఇలా అనుకోకుండా బ్లాగు‌లో కలిసినందుకు ఎంతగానో సంతోషిస్తూ...

Unknown said...

I want old telugu magazines in online, can anybody help?

Unknown said...

I want old telugu magazines in online, can anybody help?